జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెరగనున్న ఎతిహాద్‌ వాటా..!

జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెరగనున్న ఎతిహాద్‌ వాటా..!

 లండన్‌ : తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు మద్దతుగా నిలువాలని ఎతిహాద్‌ నిర్ణయించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. దేశంలో రెండో అతిపెద్ద ఎయిర్‌లైనర్‌గా పేరొందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గత 11ఏళ్లలో 9 సంవత్స రాలు నష్టాలనే చవిచూసింది. ప్రస్తుతం ఎతిహాద్‌కు మొత్తం 24శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ సంస్థలో విదేశీ సంస్థలు 49శాతం మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. 

దీంతో ఎతిహాద్‌ ఆమేరకు వాటాలను కొనుగోలు చేయనుంది. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌ తన వాటా లను విక్రయించనున్నారు. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో నరేష్‌ గోయల్‌కు 51శాతం వాటా ఉంది. ఈ ఒప్పందం అనంతరం ఆయన వాటా 20శాతం కంటే దిగువకు పడిపోనుందని తెలుస్తోంది. కాగా ఆయనకు 10శాతం ఓటింగ్‌ హక్కులు లభించను న్నాయి. ఈ రిపోర్టుతో సోమవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు 19శాతం పరుగులు పెట్టాయి. నవంబర్‌ 15 నుంచి ఇప్పటి వరకు ఈ షేర్‌ కౌంటర్‌లో వచ్చిన అతిపెద్ద లాభం ఇదే.