జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ రిటర్న్స్‌...

జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ రిటర్న్స్‌...

 రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు ఆఫర్‌ చేస్తున్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తన ప్రైమ్‌ కస్టమర్లకు మరో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను జియో ప్రకటించింది. రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లకు ఈ కొత్త జియో ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు రూ.799 వరకు ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. రీఛార్జ్‌ ఓచర్లు, వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ల రూపంలో ఈ ప్రయోజనాలు కస్టమర్లకు అందనున్నాయి. ముందటి జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో పోలిస్తే.. ప్రస్తుతం 99 రూపాయల ఎక్కువ ప్రయోజనాలను జియో అందిస్తోంది. గరిష్ట వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ను రూ.300 నుంచి రూ.399 పెంచింది. ఈ ఆఫర్‌ 2018 ఫిబ్రవరి 15(గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది.  

జియో ముందు ఆఫర్‌ చేసిన క్యాష్‌బ్యాక్స్‌ మాదిరిగా కస్టమర్లకు రూ.398, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.50తో ఎనిమిది ఓచర్లను అందించనుంది. అంటే మొత్తంగా 400 రూపాయల ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ఓచర్లతో రీఛార్జ్‌ ప్యాక్‌ కొనుగోలు చేసిన ప్రతిసారి రూ.50 తక్కువ చేసుకోవచ్చు. మిగతా రూ.399 మొత్తాన్ని కస్టమర్లకు వాలెట్‌ క్యాష్‌బ్యాక్‌ రూపంలో జియో ఆఫర్‌ చేయనుంది. మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌పే, ఫోన్‌పే, ఫ్రీఛార్జ్‌, యాక్సిస్‌ పే నుంచి ఈ క్యాష్‌బ్యాక్‌లు కస్టమర్లు పొందనున్నారు. ఎవరైతే మొబిక్విక్‌ వాలెట్‌ వాడి రూ.398 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్‌ చేయించుకుంటారో, వారికి రూ.2,500 వరకు హోటల్‌ ఓచర్‌ లభించనుంది. అదేవిధంగా పేటీఎం యూజర్లు తొలిసారి మూవీ టిక్కెట్‌ బుకింగ్‌పై 50 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందనున్నారు. ఓచర్లు, క్యాష్‌బ్యాక్‌లను యూజర్లు వెంటనే రిడీమ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ నుంచి జియో అందిస్తున్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లలో ఇది నాలుగవది.