జియో హోదా వివాదం

జియో హోదా వివాదం

 న్యూఢిల్లీ : జియోకు ప్రఖ్యాత విద్యా సంస్ధల హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలు ఎదుర్కొంటున్నది. జియో సంస్ధను దొడ్డి దారిన ఆ జాబితాలో చేర్చినట్లు పలువురు ఆరోపించారు. దేశంలోని ఆరు ప్రముఖ విద్యా సంస్ధలకు ''ప్రఖ్యాత విద్యా సంస్థల హోదా (ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌(ఐఓఇ)) కల్పిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో రిలయన్స్‌ ప్రాయోజిత జియో సంస్ధను చేర్చి వివాదాస్పదమయ్యింది. ఇంకా ప్రారంభమే కాని జియో సంస్ధకు ''ప్రఖ్యాత విద్యా సంస్ధల హోదా'' కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. 

జియోకు హోదా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలకు గురయ్యింది. విద్యాశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు పలువురు దీనిపై ట్వీట్‌ చేశారు. జియో ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది? దాని విశ్వసనీయత ఏమిటంటూ ప్రశ్నించారు. ''జియో ఇన్‌స్టిట్యూట్‌ అనేది ఒక భవనమా? ఒక వెబ్‌సైటా? ఆ సంస్ధ నుండి ఏ విద్యార్థి అయినా గ్రాడ్యుయేషన్‌ పొందారా?'' అని సుధీర్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. ''ప్రఖ్యాత విద్యా సంస్ధగా జియోను ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? దానికి రూ.1000 కోట్లు గ్రాంటు ఎలా ఇచ్చింది? ఇది సిగ్గు పడాల్సిన నిర్ణయం'' అని మరికొందరు ట్వీట్టర్‌లో ప్రశ్నించారు. ''జియో ఇన్‌స్టిట్యూట్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ కేటగిరి కింద ఉందని ఎవరు చెప్పారు.

చెన్నైకి వెలుపల గ్రీన్‌ఫీల్డ్‌ యూనివర్సిటి ఉంది. దానిని రఘురామ్‌ రాజన్‌ నిర్వహిస్తున్నారు. అంబానీతో పోలిస్తే ఆయన విద్యార్హతలు ఎక్కువే. దానిని ఎందుకు ఎంపిక చేయలేదు?'' అనిప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం మరొకసారి ముఖేష్‌, నీతా అంబానీలకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించిందని కాంగ్రెస్‌ పార్టి విమర్శించింది. ఇప్పటికి ఊహల్లో మాత్రమే ఉన్న జియో ఇన్స్టిట్యూట్‌ వెలుగు చూడాల్సివుందని, ఆ సంస్థను ఏ ప్రాతిపదికపై ప్రఖ్యాత విద్యాసంస్థ హోదాను కల్పించారో వెల్లడించాలని కాంగ్రెస్‌ పార్టి డిమాండ్‌ చేసింది.