నాలుగేండ్లలో ఖనిజ ఉత్పత్తి రెట్టింపు

నాలుగేండ్లలో ఖనిజ ఉత్పత్తి రెట్టింపు

 హైదరాబాద్ : జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ఉత్పతి వేగాన్ని పెంచింది. 2022 నాటికి 6.7 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బైజేంద్ర కుమార్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదైన 3.4 కోట్ల టన్నులతో పోలిస్తే రెండింతలు పెరుగనున్నదన్న మాట. ఇందుకోసం పలు రాష్ర్టాల్లో ఉన్న గనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఇప్పటికే సంస్థ ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో గనులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

సంస్థను ప్రారంభించి 60 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,196 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన సంస్థ.. ఈ ఏడాది రూ.3,500 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.6 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.