పది వేల కోట్ల అమ్మకాలే లక్ష్యం

 పది వేల కోట్ల అమ్మకాలే లక్ష్యం

 న్యూఢిల్లీ : రాబోయే 2-3 ఏండ్లలో రూ.10,000 కోట్ల సంస్థగా ఏదగాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్. ఆటోమోటివ్ సెగ్మెంట్‌లో తమకు రెండంకెల బలమైన వృద్ధిరేటు ఉందని చెబుతున్న ఆ సంస్థ సీఈవో ఎస్ విజయానంద్.. మున్ముందూ ఈ జోరు కొనసాగితే వచ్చే రెండు, మూడేండ్లలో అమ్మకాలను రూ.10,000 కోట్లకు చేర్చుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పీటీఐతో మాట్లాడిన ఈ హైదరాబాద్ ఆధారిత కంపెనీ సారథి.. ఇండస్ట్రియల్ సెగ్మెంట్‌లోనూ అమర రాజా అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. 

అలాగే సోలార్ విద్యుదుత్పత్తి రంగంలోనూ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉందన్న ఆయన విద్యుత్ నిల్వ కోసం క్లీన్ బ్యాటరీలు పెద్ద ఎత్తున అవసరమవుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణార్థం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుదుత్పత్తికి పెద్దపీట వేస్తున్నది తెలిసిందే. ఔత్సాహికులకు తగిన ప్రోత్సాహకాలను అందిస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలనూ సోలార్ పవర్ జనరేషన్ వైపు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాటరీలు తయారుచేసే సంస్థలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని విజయానంద్ అభిప్రాయపడ్డారు.

గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో అమర రాజా బ్యాటరీస్ ఆదాయం రూ.5,981.39 కోట్లుగా నమోదైంది. సంస్థ రెవెన్యూలో ఆటోమోటివ్ అమ్మకాల వాటా 60 శాతం ఉందని, ఇండస్ట్రియల్ వాటా 40 శాతంగా ఉందని విజయానంద్ చెప్పారు. ఇండస్ట్రియల్ సెగ్మెంట్‌లో టెలికం పరిశ్రమ, యూపీఎస్‌ల నుంచి అధిక అమ్మకాలను చూస్తున్నామని, సోలార్ పవర్ నుంచీ అమ్మకాలు ఇప్పుడిప్పుడే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా గడిచిన ఐదేండ్లకుపైగా కాలంలో రెవెన్యూపరంగా దాదాపు 14-15 శాతం వార్షిక వృద్ధిరేటును కంపెనీ నమోదు చేసిందని వెల్లడించారు.