సిమ్ కార్డుకు ఆధార్ తప్పనిసరి కాదు!

సిమ్ కార్డుకు ఆధార్ తప్పనిసరి కాదు!

 న్యూఢిల్లీ: ఆధార్ లేకుండా ఇప్పుడు ఏ పనీ జరగడం లేదు. అలాంటిది ఎంతో ముఖ్యమైన సిమ్ కార్డు పొందడానికి మాత్రం ఇక ఆధార్‌తో పనిలేదు. ప్రభుత్వమే టెలికాం ఆపరేటర్లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ బదులు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, వోటర్ ఐడీలాంటి వాటిని తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను వెంటనే పాటించాలని, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని టెలికాం సెక్రటరీ అరుణా సుందరరాజన్ స్పష్టంచేశారు. ఇన్నాళ్లూ ఆధార్‌కార్డు లేకపోతే సిమ్ ఇచ్చేవాళ్లు కాదు. 


అటు సుప్రీంకోర్టు కూడా తమ తుది ఆదేశాలు వెలువడే వరకు సిమ్ కార్డు పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆధార్ తప్పనిసరి కాదని మొబైల్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు అరుణ వెల్లడించారు. ఆధార్ లేక సిమ్ పొందలేనివాళ్లలో స్థానికులే కాకుండా ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లలో చాలా మందికి ఆధార్ కార్డు లేదు. దీంతో సిమ్ కార్డు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆధార్ కాకుండా ఇతర ఏ గుర్తింపు కార్డు ఉన్నా వాటి ద్వారా కేవైసీ వివరాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పటికే మొబైల్ నంబర్ ఉన్న వాళ్లు ఆధార్‌తో లింకు చేసుకోవాలని టెలికాం ఆపరేటర్లు ప్రతి రోజూ మెసేజ్‌లు, కాల్స్ ద్వారా కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు. తమ తుది ఆదేశాలు వెలువడే వరకు ఆధార్ అనుసంధానం అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా.. ఈ ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.