టవర్లను లీజుకివ్వనున్న బీఎస్ఎన్ఎల్

టవర్లను లీజుకివ్వనున్న బీఎస్ఎన్ఎల్

 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన మొబైల్ టవర్ల విభాగాన్ని విభజించి ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4.42 లక్షల మొబైల్ టవర్లున్నాయి. అందులో 66 వేలకు పైగా టవర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందినవి. టవర్ల విభాగాన్ని విభజించి సంస్థ పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసేందుకు మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది. 

తద్వారా సంస్థకు ఆదాయం పెంచుకునే అవకాశం లభించినైట్లెంది. ఎందుకంటే, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల నిర్వహణ సంస్థ ఇతర టెలికం ఆపరేటర్లకు సైతం తన ఆస్తులను లీజుకిచ్చేందుకు వీలుకలుగనుంది. తద్వారా టవర్ల నిర్వహణ భారం తగ్గడంతోపాటు ఆదాయం పెరిగి లాభదాయకత మెరుగుపడనుంది. రూ.10,881 కోట్ల డెయిరీ ప్రాసెసింగ్ ఫండ్‌కు అనుమతి : వచ్చే పన్నెండు ఆర్థిక సంవత్సరాల్లో (2028-29కల్లా) పాల ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధిపర్చేందుకు రూ.10,881 కోట్లతో డెయిరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) ఈ ఫండ్‌ను నిర్వహించనుంది.