త్వరలో జియో పేమెంట్స్ బ్యాంక్ సేవలు..!

త్వరలో జియో పేమెంట్స్ బ్యాంక్ సేవలు..!

  ఇప్పటి వరకు 4జీ నెట్‌వర్క్ సేవలతో వినియోగదారులను ఆకట్టుకున్న రిలయన్స్ జియో ఇకపై బ్యాంకింగ్ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నది. ఈ విషయమై ఇప్పటికే ఎస్‌బీఐ బ్యాంక్‌తో జియో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మార్చిలో 10 కోట్ల వినియోగదారుల మార్క్‌ను దాటిన జియో ఆర్‌బీఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ పొందింది. కాగా డిసెంబర్ నెలలో ఈ బ్యాంక్ సేవలను ప్రారంభించనుంది.


ఎయిర్‌టెల్, పేటీఎం వంటి సంస్థలు ఇప్పటికే పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందిస్తుండగా ఆ కోవలో ఇప్పుడు జియో వచ్చి చేరనుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందించాలని ఆర్‌బీఐ సూచించడంతో జియో ప్రస్తుతం ఆ పనిలో పడింది. కస్టమర్లకు ఎలాంటి సమస్య తలెత్తకుండా సౌకర్యవంతంగా పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నది. డిసెంబర్ నెలలో జియో తన పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.