త్వరలో రానున్న జియో బ్రాడ్‌బ్యాండ్..!

త్వరలో రానున్న జియో బ్రాడ్‌బ్యాండ్..!

  టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను జియో ఆకట్టుకుంటూనే వస్తున్నది. అయితే కేవలం టెలికాం రంగంలోనే కాక, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ రంగంలోకి కూడా జియో అడుగు పెడుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతి త్వరలో ఈ సేవలు వినియోగదారులకు లభించనున్నట్లు తెలిసింది. జియో ఫైబర్ టు ది హోమ్ (ఎఫ్టీటీహెచ్) బ్రాడ్‌బ్యాండ్ సేవలను అతి త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుండగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుందట. అలాగే 100 జీబీ డేటా అయిపోతే 40 జీబీ డేటాను టాపప్ వేయించుకునే వెసులుబాటును కల్పించనుందట.

ఇలా ఒక నెలలో ఏకంగా 25 సార్లు 40 జీబీ డేటాను.. అంటే మొత్తం 1,100 జీబీ డేటాను జియో కస్టమర్లకు ఇవ్వనున్నట్లు తెలిసింది జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కావాలంటే రూ.4500 వరకు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను కట్టాల్సి ఉంటుందని తెలిసింది. ఇక బ్రాడ్‌బ్యాండ్‌తోపాటు సెట్ టాప్ బాక్స్‌ను ఉచితంగా ఇస్తారట. దాంతో ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీసెస్ (ఐపీటీవీ) ను వాడుకునేందుకు వీలుంటుంది. కాగా ఇప్పటికే జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు అందిస్తూ వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఆ సేవలు కస్టమర్లకు లభించే అవకాశం ఉంది.