2018 ఐపిఎల్‌ నిబంధనలు ఖరారు

2018 ఐపిఎల్‌ నిబంధనలు ఖరారు

 ముంబాయి : ఐపిఎల్‌ 2018లో ఎంఎస్‌ ధోనీ చెన్నై జట్టు తరఫున ఆడనున్నాడు. రెండేళ్ళ నిషేధం అనంతరం రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ 2018లో మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాయి. బుధవారం ఇక్కడ బిసిసిఐ తాత్కాలిక సెక్రటరీ అమితాబ్‌ చౌదరి నేతృత్వంలో ఐపిఎల్‌ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం రెండేళ్ళ నిషేధానికి గురైన చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లను 2018లో జరిగే 11వ ఐపిఎల్‌ సీజన్‌లో ఆడేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఇప్పటికి 10 ఐపిఎల్‌ టోర్నిలో అనంతరం అన్ని ఫ్రాంచేజీలు తమ జట్ల క్రీడాకారులందరినీ వేలంలో పెట్టనున్నాయి. కొన్ని జట్లు ముగ్గురిని, మరికొన్ని జట్లు ఐదుగురిని తమ ఫ్రాంచేజీలలో కొనసాగించుకొనేందుకు అనుమతి కోరాయి.

దీంతో ఐపిఎల్‌ గవర్నింగ్‌ కమిటీ ప్రతి ఒక్క ఫ్రాంచేజీ ఐదుగురు క్రీడాకారులను తమ ఫ్రాంచేజీలలో ఉంచుకొనేందుకు అనుమతించింది. వీరిలో ముగ్గురు స్వదేశీ, ఇద్దరు విదేశీ క్రీడాకారులు ఉండేలా ఆయా ఫ్రాంచేజీలు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రాంచేజీ స్వదేశీ క్రీడాకారులను ఇద్దరికి తగ్గకుండా ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం 8 జట్లు ఐపిఎల్‌ 11వ సీజన్‌లో తలపడనున్నాయి. ఐపిఎల్‌ 9, 10 సీజన్‌లలో పాల్గొన్న గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పూనే జట్లు 11వ సీజన్‌నుండి నిష్క్రమించాయి. ఐపిఎల్‌ 11వ సీజన్‌లో తలపడనున్న జట్లు : చెన్నై సూపర్‌కింగ్స్‌, కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌.

 ఫ్రాంచేజీల నిబంధనలు...
1) 2018 సీజన్‌లో ప్రతి ఒక్క ఫ్రాంచేజీ 80 కోట్లకు మించి క్రీడాకారులను కొనుగోలు చేయరాదు. 2019 సీజన్‌లో 82 కోట్లు, 2020 సీజన్‌లో 85 కోట్ల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. 2) ఒకవేళ ఈ సీజన్‌లో స్వదేశీ క్రీడాకారులు ముగ్గుర్ని ఒక ప్రాంచేజీ ఉంచుకోవాల్సి వస్తే ముగ్గురు క్రీడాకారులకు 33 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి క్రీడాకారుడికి 15 కోట్లు, రెండో క్రీడాకారునికి 11 కోట్లు, మూడో క్రీడాకారునికి 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

3) ఒకవేళ ఇద్దరు స్వదేశీ క్రీడాకారులనే ఫ్రాంచేజీలో ఉంచుకోవాల్సి వస్తే మొదటి క్రీడాకారునికి 12.5 కోట్లు, రెండో క్రీడాకారునికి 8.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 4) కేవలం ఒక్క స్వదేశీ క్రీడాకారుడినే ఫ్రాంచేజీ ఉంచుకోవాల్సి వస్తే ఆ క్రీడాకారునికి తప్పనిసరిగా 12.5 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

5) ఒక వేళ జట్టు ఒక అన్‌క్యాప్డ్‌ ఆటగాడిని వుంచుకోవాలనుకుంటే అందుకోసం ఆ యాజమాన్యం రూ. 3 కోట్లును చెల్లించాల్సి వస్తుంది.6) 8 జట్ల ఫ్రాంచేజీలు మొత్తం 25 క్రీడాకారులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 8 మంది క్రీడాకారులకు మించకుండా విదేశీ క్రీడాకారులను ఎంపిక చేసుకోవాలి. 18 మంది స్వదేశీ క్రీడాకారులు తప్పనిసరిగా ఆ ఫ్రాంచేజీలో ఉండాలి. 
2018 నుండి క్రీడాకారులకిచ్చే కనీస ధరలు...

6) అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవంలేని క్రీడాకారులకు ఇప్పటివరకు కనీస ధర 10 లక్షలుగా వుంది. దీన్ని 20 లక్షలకు పెంచారు. 2) ఇంతకుముందు విదేశీ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న క్రీడాకారులకు ఇచ్చే మొత్తం ఇంతకుముందు 1 కోటి, 1.5 కోట్లుగా ఉండేది. దానిని ఇప్పుడు 2 కోట్ల రూపాయలకు పెంచారు.