ఆసీస్‌కు మూడో విజయం

ఆసీస్‌కు మూడో విజయం

 ముంబై: ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ముక్కోణపు టీ20 సిరీస్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కంగారూలు మూడు విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లతో జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 11.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ హీలీ (6), విలానీ (1) విఫలమైనా... పెర్రీ (32 బంతుల్లో 47 నాటౌట్; 9 ఫోర్లు), లానింగ్ (28 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) సమయోచితంగా ఆడారు. ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 85 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో 96 పరుగులకు కుప్పకూలింది. రిచర్డ్స్ (24) టాప్ స్కోరర్. బీమోంట్ (17)తో సహా మిగతా వారు విఫలమయ్యారు. ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లు కిమ్నినెస్ (3/20), జొనాసెన్ (2/21), షుట్ (2/13) సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. గురువారం జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్.. భారత్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.