ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

ఆసీస్ చేతిలో భారత్ ఓటమి

 వడోదర: భారత మహిళల వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఆసీస్ ఓపెనర్ బోల్టన్ శతకంతో విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యం సంపాదించింది. అనారోగ్యం కారణంగా కెప్టెన్ మిథాలీరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును నడిపించింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు 50 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌట్ అయింది. 


వస్ట్రాకర్ (51), సుష్మ (41), పూనమ్‌రౌత్ (37) ఫరవాలేదనిపించారు. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ముంబై యువ సంచలనం జెమీమా(1) నిరాశపరిచింది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ (4/30), వెల్లింగ్టన్ (3/24) భారత్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో సఫలమయ్యారు. 201 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆడుతూ పాడుతూ 32.1 ఓవర్లలో (202/2) ఛేదించింది. ఓపెనర్ బోల్టన్ (100 నాటౌట్) అజేయ శతకంతో దుమ్మురేపగా, హీలే (38), లానింగ్ (33) సహకారం అందించారు. భారత బౌలర్లో శిఖా పాండేకు ఒక వికెట్ దక్కింది.