భారత క్రికెట్లో అత్యధిక సిక్సర్ల మొనగాడు

భారత క్రికెట్లో అత్యధిక సిక్సర్ల మొనగాడు

 ఇండోర్: భారత క్రికెటర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. శుక్రవారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో ముంబయి ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ వేసిన ముజీబ్ రహమాన్ బౌలింగ్‌లో ఒక సిక్స్ బాదాడు. దీంతో టీ20 క్రికెట్లో 300కు పైగా సిక్స్‌లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో 78 సిక్స్‌లు బాదాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటి వరకు 183 సిక్స్‌లు కొట్టాడు.

మిగతా 40 సిక్స్‌లను టీ20 ఛాంపియన్స్ లీగ్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు టీ20 టోర్నమెంట్లో సాధించాడు. మొత్తంగా రోహిత్ పేరిట 301 సిక్స్‌లు ఉన్నాయి. పొట్టిక్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో కరీబియన్ స్టార్ క్రిస్‌గేల్(844) అగ్రస్థానంలో ఉన్నాడు. తరువాతి స్థానంలో కీరన్ పొలార్డ్(525), బ్రెండన్ మెక్‌కలమ్(445), డ్వేన్ స్మిత్(367), షేన్ వాట్సన్(357),డేవిడ్ వార్నర్(319), రోహిత్(301)అత్యధిక సిక్సర్లు కొట్టి ముందంజలో ఉన్నారు.