భారత  టాప్ అథ్లెట్ పై నిషేధం 

భారత  టాప్ అథ్లెట్ పై నిషేధం 

 న్యూఢిల్లీ: భారత మహిళల టాప్ అథ్లెట్ ప్రియాంక పన్వర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువవడంతో ప్రియాంకపై ఏకంగా ఎనిమిదేండ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్యానెల్ సోమవారం తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక గతేడాది ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలిందని నాడా చీఫ్ నవీన్ అగర్వాల్ తెలిపారు.

దీంతో గతేడాది జూలై నుంచి ప్రియాంకపై 8ఏండ్ల నిషేధం వర్తించనున్నట్లు నవీన్ ప్రకటించారు. నాడా నిబంధనల ప్రకారం ఎవరైనా అథ్లెట్ రెండోసారి డోపీగా పట్టుబడితే గరిష్ఠంగా 8ఏండ్ల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరో ఐదుగురు అథ్లెట్లతో కలిసి ప్రియాంక 2011లో డోపీగా తేలడంతో అప్పట్లో రెండేండ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నది. తాజా నిషేధంతో 29ఏండ్ల ప్రియాంక కెరీర్ దాదాపు ముగిసినట్లే అనుకోవచ్చు. 2014 ఆసియా క్రీడల్లో మహిళల 4X400 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించిన భారత జట్టులో ప్రియాంక సభ్యురాలు.