క్రికెట్ కెరీర్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు..

క్రికెట్ కెరీర్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు..

 హైదరాబాద్: భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచే తనకు చివరిదని వెల్లడించాడు. ప్రస్తుతం మూడో టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ ఢిల్లీ బౌలర్ గురువారం మీడియా సమక్షంలో రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ఇంకా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించడం లేదు అని ప్రజలు పదేపదే అడుగడం కంటే ముందే వీడ్కోలు పలికితే మంచిదని నేను భావించా. ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్షన్ కమిటీ చైర్మన్‌తో మాట్లాడా. ఢిల్లీలో కివీస్‌తో తొలి మ్యాచ్ తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతా. సొంత అభిమానుల ముందు వీడ్కోలు పలుకడం కంటే పెద్ద అంశం మరోటి ఉండదు. 20 ఏండ్ల కిందట ఇక్కడే నా తొలి రంజీ మ్యాచ్ ఆడా అని నెహ్రా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో కూడా ఆడబోనని స్పష్టం చేశాడు. 1999లో అజరుద్దీన్ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన నెహ్రా.. 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 44, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు పడగొట్టాడు.