క్రికెటర్లపై కాసుల వర్షం

క్రికెటర్లపై కాసుల వర్షం

 ముంబయి : ఆస్ట్రేలియా గడ్డపై ఏడు దశాబ్దాల తర్వాత టెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించిన టీమిండియాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) నజరానా ప్రకటించింది. తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకి ఒక్కొక్కరికి ఒక టెస్ట్‌కు రూ.15 లక్షలు చొప్పున నాలుగు టెస్టులు ఆడిన ఆటగాడికి రూ. 60 లక్షలు, రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ.30 లక్షలు చొప్పున ఇవ్వనుంది. ఆటగాళ్లకే కాకుండా కోచ్‌లకు సైతం రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. సపోర్టింగ్‌ స్టాఫ్‌కు వేతనంతో సమానమైన నజరానా అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఆటగాళ్లు అందుకోబోయే నగదు బహుమానం మ్యాచ్‌ ఫీజుకి సమానం కావడం గమనార్హం. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా కోహ్లీసేన 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుని 72 ఏళ్ల కలను నెరవేర్చిన విషయం తెలిసిందే.