క్రికెట్‌కు అజ్మల్ గుడ్‌బై

 క్రికెట్‌కు అజ్మల్ గుడ్‌బై

 కరాచీ: పాకిస్థాన్ స్పిన్ బౌలర్ సయ్యద్ అజ్మల్ అంతర్జాతీయ క్రికెట్‌కు సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. చకింగ్ కారణంగా తన బౌలింగ్ శైలిని మార్చుకున్నప్పటికీ గత రెండేండ్లుగా అంతర్జాతీయ స్థాయిలో వికెట్లు తీయలేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నీ తర్వాత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటా. నా కెరీర్ బాగా సంతృప్తినిచ్చింది. నేను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరగలిగాను. పాక్‌కు కూడా మంచి విజయాలు అందించాననే నమ్ముతున్నా అని అజ్మల్ పేర్కొన్నాడు. ఓ దశలో వన్డే, టీ20ల్లో నంబర్‌వన్ బౌలర్‌గా వెలుగొందిన అజ్మల్.. టెస్టుల్లోనూ అదే స్థాయిలో సత్తా చాటాడు.

కానీ 2009లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో అతని బౌలింగ్ శైలి (చకింగ్)పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. తర్వాత 2014లోనూ రెండోసారి మళ్లీ చకింగ్ చేస్తున్నాడని తేలడంతో ఐసీసీ రెండుసార్లు నిషేధం విధించింది. బౌలింగ్ శైలిని పూర్తిస్థాయిలో మార్చుకుని 2015లో పునరాగమనం చేసినా పెద్దగా రాణించలేకపోయాడు. తన శైలి మీద నిషేధం విధించడం చాలా బాధకు గురి చేసిందని అజ్మల్ వాపోయాడు. పాక్ తరఫున 35 టెస్టుల్లో 178, 113 వన్డేల్లో 184 వికెట్లు తీశాడు. 64 టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. కాగా 2012లో ఇంగ్లండ్ పై మూడు టెస్టుల్లో కలిపి 24 వికెట్లు పడగొట్టడం అజ్మల్ కెరీర్ లో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు.