ఐపిఎల్‌ వేదికల్లో స్వల్ప మార్పులు

ఐపిఎల్‌ వేదికల్లో స్వల్ప మార్పులు

  కోల్‌కతా : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)-11 సీజన్‌ షెడ్యూల్‌ వేదికల్లో స్పల్ప మార్పులు చేసినట్లు ఐపిఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచులకు పూణె మైదానం మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసిఎ) ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే రెండుమ్యాచ్‌ల వేదికలను కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌కు తరలిస్తూ శుక్రవారం ఐపిఎల్‌ పాలకమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. మే 23, 25 తేదీల్లో ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచులు జరగనున్నాయి.

పూణె మైదానం కన్నా చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్‌ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఐపిఎల్‌ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడెన్‌లో 67 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు అవకాశముంది. క్వాలిఫయర్‌-1 యథావిధిగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే మే 22న జరగనుంది. మే 27న టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా ఈ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. తొలుత ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లకు చెన్నైలోని చెపాక్‌ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సిండగా.. కావేరి వివాదంతో ఆ జట్టు సొంత మైదానంగా పుణెలో ఆడుతున్న విషయం తెలిసిందే.