కివీస్‌ మహిళాజట్టు రికార్డ్‌ స్కోర్‌

కివీస్‌ మహిళాజట్టు రికార్డ్‌ స్కోర్‌

 డబ్లిన్‌: ఐర్లాండ్‌ ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్‌ మహిళల జట్టు 490 పరుగుల రికార్డ్‌ స్కోర్‌ చేసింది. దీంతో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా కివీస్‌ మహిళల జట్టు చరిత్ర సృష్టిం చింది. శుక్రవారం ఆతిథ్య ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టుకు ఓపెనర్లు సుజరు బేట్స్‌ 151(94 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లు), జెస్సీ వాట్కిన్‌(62)లు చెలరేగడంతో పాటు.. మాడీ గ్రీన్‌ 121(77 బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్‌), అమెలియా కెర్‌ (81) మెరుపులు మెరిపించారు.

దీంతో కివీస్‌ మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు భారీస్కోర్‌ సాధించింది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఐర్లాండ్‌ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో కివిస్‌ జట్టు 346 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో 1997లో పాకిస్తాన్‌పై కివీస్‌ సాధించిన 455 పరు గుల రికార్డును జట్టు తిరగరాసి నూతన చరిత్రను సృష్టించింది. ఇక పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ చేసిన 444 పరుగులే ఇప్పటి వరకు అత్యధికం కావడం గమనార్హం.