మాజీ సారథికి అరుదైన గౌరవం

మాజీ సారథికి అరుదైన గౌరవం

  ఆన్‌లైన్‌ : టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనికి అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) తన అధికారిక ట్విటర్‌ ఆకౌంట్‌ కవర్‌ ఫొటోగా ధోని చిత్రాన్ని పెట్టుకుంది. ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లో ధోని అద్భుత ఆటతీరుకు గుర్తుగా ఐసిసి ట్విటర్‌లో ధోని కవర్‌ ఫొటో పెట్టినట్టు వివరించింది. దీంతో జార్ఖండ్‌ డైనమెట్‌ అభిమానులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐసిసి ట్విటర్‌కు సంబంధించిన ఫొటోలను స్క్రీన్‌షాట్‌లు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా గొప్ప వ్యక్తి ఫొటోను ఐసిసి తన ట్విటర్‌ కవర్‌ ఇమేజ్‌గా పెట్టుకుందని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు ఐసిసి ధోని ఆటను గుర్తించిందని.. కానీ విమర్శకులు గుర్తించారో లేదో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణమండలి (ఐసిసి) సోమవారం ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్‌్‌ జాబితాలో భారత్‌ 116 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. టెస్ట్‌ బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 922 పాయింట్లతో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. తర్వాతి స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన కేన్‌ విలియమ్సన్‌ 897 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక భారత్‌కు చెందిన నయా వాల్‌ ఛటేశ్వర పుజారా(881 పాయింట్లు) తొలిసారి మూడవ స్థానానికి చేరుకున్నాడు. వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ తొలిసారి టాప్‌ 20లో చోటుదక్కించుకున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన రబాడా అగ్రస్థానానికి చేరుకున్నాడు.

భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టీమిండియా పేస్‌ బౌలర్‌ జప్రీత్‌ బుమ్రా 711 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. బుధవారం నుంచి ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకున్నా ర్యాంకుల్లో ఏవిధమైన మార్పులుండవు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ మూడోస్థానంలో, వెస్టిండీస్‌ ఎనిమిదో స్థానంల్లో ఉన్నాయి. మరికొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోనూ విజయాలను నమోదు చేసుకున్నా ఆయాజట్ల స్థానాలు మారే అవకాశం లేదు.