మరో రికార్డుపై కోహ్లీసేన గురి

మరో రికార్డుపై కోహ్లీసేన గురి

  మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ 2-1తో చేజిక్కించుకొని నయా చరిత్ర సృష్టించిన టీమిండియా ఇప్పుడు మరో రికార్డుపై కన్నేసింది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో టీమిండియా గెలిస్తే కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్‌నూ టీమిండియా గెలిచిన సందర్భం లేదు. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియాపై వన్డే ఫార్మాట్‌లో సిరీస్‌లు సాధించినప్పటికీ అవి ద్వై పాక్షిక వన్డే సిరీస్‌లు కావు. ఒకటి 1985లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌ టైటిల్‌ కాగా, రెండోది మూడు దేశాలు పాల్గొన్న సీబీ సిరీస్‌. 

దాంతో ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో తొలిసారి ఆసీస్‌ను వారి దేశంలో ఓడించే అవకాశం టీమిండియా ముంగిట ఉంది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్న కోహ్లీ సేన ఆసీస్‌ పర్యటనకు ఘనమైన ముగింపు ఇచ్చే యోచనలో ఉంది. శుక్రవారం మెల్‌బోర్న్‌ వేదికగా ఇరుజట్ల మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక ఆఖరివన్డే జరుగనుంది. భారత్‌-ఆసీస్‌లు తలో వన్డే గెలిచి సమంగా నిలవడంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి వన్డేలో ఆసీస్‌ 34 పరుగుల తేడాతో గెలవగా, రెండో వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. నేటిమ్యాచ్‌లో భారత్‌ గెలిచిన పక్షంలో ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్‌ను కోల్పోకుండా ముగించినట్లు అవుతుంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమం కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.