ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ

ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ

  దుబాయ్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. తన తొలి గ్లోబల్ క్రికెట్ అకాడమీని శనివారం యూఏఈలో ఘనంగా ప్రారంభించాడు. దుబాయ్‌కు చెందిన పసిఫిక్ స్పోర్ట్స్ క్లబ్, ఆర్కా స్పోర్ట్స్ క్లబ్, ధోనీ సంయుక్త భాగస్వామ్యంలో ఈ అకాడమీ పని చేస్తుంది. అల్ క్వైజ్‌లోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో అన్ని వసతులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. మరో రెండు నెలల్లో ఇది పూర్తిస్థాయి కార్యకలాపాలతో పని చేయనుంది. క్రికెట్‌లో ఓనమాలు దిద్దాలనుకుంటున్న కుర్రాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, కోచ్‌లు, భాగస్వాముల మధ్య మహీ ఈ అకాడమీని అధికారికంగా ఆవిష్కరించాడు. 

నాలుగు టర్ఫ్, మూడు సిమెంట్, మూడు మ్యాటెడ్ పిచ్‌లను ఇందులో తీర్చిదిద్దారు. స్పిన్, స్వింగ్ బౌలింగ్ మెషిన్లు, సేఫ్టీ నెట్స్, రాత్రి ప్రాక్టీస్ కోసం లైట్స్‌ను ఏర్పాటు చేశారు. నాణ్యమైన క్రికెట్ వస్తువులను అందించాలనే ఉద్దేశంతో క్రికెట్‌లోని అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ షాప్, వీడియో విశ్లేషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచారు. రెగ్యులర్‌గా మ్యాచ్‌లు నిర్వహించడం అకాడమీకి ఉన్న మరో ప్రత్యేకత. అలాగే శిక్షణ పొందుతున్న క్రికెటర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇతర జట్లతో పోటీలూ పెట్టడం, వాళ్ల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చించడం చేయనున్నారు. అకాడమీలో అందరూ భారత్ కోచ్‌లే పని చేయనున్నారు.

ముంబై మాజీ బౌలర్ విశాల్ మహదిక్ వీరికి సారథ్యం వహించనున్నాడు. తొలి అకాడమీని ఏర్పాటు చేసినందుకు ధోనీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అకాడమీని విజయవంతం చేసేందుకు నావంతు సాయం అందజేస్తా. వీలైనన్ని మార్గాల్లో క్రికెట్‌కు సేవ చేయడమే నా లక్ష్యం. అందులో భాగమే ఈ అకాడమీ. ఇది నా తొలి అడుగు. నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం ఉన్న కుర్రాళ్లే ఈ అకాడమీని ముందుకు తీసుకెళ్తారు అని మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు.