‘నేనే విశ్రాంతి అడిగా’

‘నేనే విశ్రాంతి అడిగా’

 న్యూఢిల్లీ: శ్రీలంకతో సిరీస్‌కు తనను మొదట ఎంపిక చేసి తర్వాత విశ్రాంతి ప్రకటించడంపై భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతుండటంతో విరామం కావాలని తానే టీమ్ మేనేజ్‌మెంట్‌ను అడిగానని స్పష్టం చేశాడు. నేను వంద శాతం ఫిట్‌గా లేనని నా భావన. అందుకే విశ్రాంతి కోరా. ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల కాస్త అలసటకు గురయ్యా. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పుడు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. అప్పుడే వందశాతం ప్రదర్శన ఇవ్వొచ్చు. ఇప్పుడు ఈ విరామం లభించడం నిజంగా నా అదృష్టమే. ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడానికి జిమ్‌లో బాగా కసరత్తులు చేయొచ్చు. 

దీంతో దక్షిణాఫ్రికా టూర్‌లో ఉత్సాహంగా ఆడొచ్చు. ఈ పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నా ఫిట్‌నెస్‌ను పూర్తిస్థాయిలో మెరుగుపర్చుకోవడానికే ఈ బ్రేక్‌ను వినియోగించుకుంటున్నా అని ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ తీసుకుంటున్న హార్దిక్ వెల్లడించాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో దక్షిణాఫ్రికాలో మరింత భిన్నంగా రాణిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌కు చాలా ప్రాధాన్యత ఉందని, చాలా సవాళ్లతో కూడుకున్నదని చెప్పాడు. కాబట్టి టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో కచ్చితంగా రాణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.