నెంబర్‌ 1 ర్యాంకు కోల్పోయిన కోహ్లీసేన

నెంబర్‌ 1 ర్యాంకు కోల్పోయిన కోహ్లీసేన

 దుబాయ్‌ : అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే, టి20 తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీసేన నెంబర్‌ 1 ర్యాంకును కోల్పో యింది. వన్డేల్లో రెండోస్థానంతో సరిపెట్టుకోగా.. టి20ల్లో మూడో స్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకుల సమీకరణంలో 2015-16, 2016-17 సీజన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఐసిసి ఈ ర్యాంకులను వెల్లడించింది. వన్డేల్లో ఇంగ్లాండ్‌ జట్టుకు తాజాగా 8 పాయింట్లు కలుపుకొని 125 పాయింట్లతో ఇంగ్లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌ భారత్‌ తన ఖాతా నుంచి ఒక పాయింట్‌ కోల్పోయి 122 పాయింట్లతో రెండో స్థానంతో సరి పెట్టుకుంది.

తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణా ఫ్రికా(113), న్యూజిలాండ్‌(112), ఆస్ట్రేలియా (104), పాకిస్థాన్‌(102), బంగ్లాదేశ్‌ (93), శ్రీలంక (77), వెస్టిండీస్‌ (69), అఫ్గానిస్థాన్‌ (63) నిలిచాయి. జులైలో భారత్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లి వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ గెలిచి తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.మరోవైపు టి20 ర్యాంకుల్లో తొలి ఏడు స్థానాల్లో ఎలాంటి మార్పులూ జరగలేదు. పాకిస్థాన్‌ 130 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (126), నిలవగా, భారత్‌(123) మూడోస్థానానికి పరిమిత మైంది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్‌ (116), ఇంగ్లాండ్‌ (115), దక్షిణాఫ్రికా(114), వెస్టిండీస్‌(114) కొనసాగుతున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే శ్రీలంకను వెనక్కి నెట్టి అప్ఘానిస్థాన్‌ 8వ స్థానంలో నిలవడం. శ్రీలంక, బంగ్లాదేశ్‌ టాప్‌-10లో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.