ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు...

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు...

  అడిలైడ్: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపించే సీన్ ఇది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో యువరాజ్, గిబ్స్‌లాంటి క్రికెటర్లు ఈ అరుదైన ఘనత సాధించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా టీనేజ్ సెన్సేషన్ ఒలివర్ డేవీస్ కూడా ఈ క్లబ్‌లో స్థానం సంపాదించాడు. అండర్ 19 నేషనల్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో డేవీస్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. నార్తర్న్ టెరిటరీతో జరిగిన మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ మెట్రో టీమ్‌కు ఆడిన ఒలివర్.. కేవలం 115 బంతుల్లో 207 పరుగులు చేయడం విశేషం. అందులో మొత్తం 17 సిక్స్‌లు ఉన్నాయి. తొలి సెంచరీని 74 బాల్స్‌లో అందుకున్న ఒలివర్.. ఆ తర్వాత సెంచరీని కేవలం 39 బాల్స్‌లోనే చేశాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ జాక్ జేమ్స్ వేసిన ఆరు బాల్స్‌నూ ఒలివర్ స్టాండ్స్‌లోకి పంపించాడు. అండర్ 19 చాంపియన్‌షిప్స్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఒలివర్ నిలిచాడు. తొలి రెండు సిక్సర్లు బాదినప్పుడే మొత్తం ఆరు బాల్స్‌లోనూ సిక్స్‌లు కొట్టాలని నిర్ణయించుకున్నానని డేవీస్ చెప్పాడు.