ఓపెనర్ స్మృతి మందన మురిసెన్

ఓపెనర్ స్మృతి మందన మురిసెన్

 ముంబై: ఫైనల్ బెర్త్‌ను దూరం చేసుకుని ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న భారత మహిళల జట్టుకు.. ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఓదార్పు విజయం దక్కింది. ఓపెనర్ స్మృతి మందన (41 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో.. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఈ టోర్నీలో మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన భారత్.. మూడు పరాజయాలతో టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. 

యాట్ (22 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేయడంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌వుమెన్ పరుగులు చేయడానికి తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అనూజ పాటిల్(3/21), రాధా యాదవ్ (2/16), పూనమ్ యాదవ్ (2/17), దీప్తి శర్మ (2/24) వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. 108 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారీ ఆశలు పెట్టుకున్న హైదరాబాదీ మిథాలీ రాజ్ (6) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగింది. ఆరో ఓవర్ రోడ్రిగ్వేజ్ (7) కూడా ఔట్‌కావడంతో టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడింది. అనూజ పాటిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.