>

షేన్ వార్న్ మళ్లీ వచ్చాడు

షేన్ వార్న్ మళ్లీ వచ్చాడు

  ముంబైః ఆస్ట్రేలియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ మెంటార్‌గా నియమించింది ఆ ఫ్రాంచైజీ. కెప్టెన్‌గా ఐపీఎల్ తొలి ఎడిషన్‌లోనే రాజస్థాన్‌ను విజేతగా నిలిపాడు షేన్ వార్న్. మళ్లీ తాను ఐపీఎల్‌కు వస్తున్నట్లు గత వారమే ట్విట్టర్‌లో ఓ హింట్ ఇచ్చాడు. త్వరలోనే మీతో ఓ న్యూస్ పంచుకోబోతున్నా.. అది ఐపీఎల్ గురించే అని వార్న్ చెప్పాడు. తాజాగా ఇవాళ అతన్ని మెంటార్‌గా నియమిస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ టీమ్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని వార్న్ చెప్పాడు. టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్.. ఐపీఎల్‌లోనూ తన స్థాయికి తగినట్లు రాణించాడు. మొత్తం 52 మ్యాచుల్లో 56 వికెట్లు తీసుకున్నాడు. 2011లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన వార్న్.. తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పాడు. మరి రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రాజస్థాన్‌కు మెంటార్‌గా అతను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే స్మిత్, స్టోక్స్, రహానే, జైదేవ్ ఉనద్కట్‌లాంటి ప్లేయర్స్ ఉన్న రాజస్థాన్.. ఈ సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.