శ్రీలంకతో రెండు టెస్టులకు జట్టు ఎంపిక 

శ్రీలంకతో రెండు టెస్టులకు జట్టు ఎంపిక 

 న్యూఢిల్లీ: భారీ మార్పులు.. అనూహ్య పరిణామాలకు తావివ్వకుండా శ్రీలంకతో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత్ జట్టును సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను మొదట జట్టులోకి ఎంపిక చేసినా.. మళ్లీ విశ్రాంతి పేరుతో తప్పించారు. పని భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వెల్లడించింది. అయితే అతని స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయకపోవడంతో పాండ్యాకు ఏమైందనే ఊహాగానాలు మొదలయ్యాయి. పని భారమేనా లేక గాయంతో ఏమైనా బాధపడుతున్నాడనే తెలియడం లేదు. తిరువనంతపురంలో జరిగిన మూడో టీ20లో కివీస్ బ్యాట్స్‌మన్ కొట్టిన బలమైన షాట్‌ను ఆపే ప్రయత్నంలో హార్దిక్ నొప్పితో విలవిలలాడిన సంగతి తెలిసిందే. 

ఇప్పటికీ ఆ నొప్పి నుంచి తేరుకోలేదని సమాచారం. ఈ ఖాళీ సమయంలో పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాడని బోర్డు తెలిపింది. జూ న్‌లో చాంపియన్స్ ట్రోఫీ మొదలుకొని పాం డ్యా మూడు టెస్టులు, 22 వన్డేలు, ఐదు టీ20లు ఆడాడు. దీంతో రాబో యే విదేశీ పర్యటలను దృష్టిలో పెట్టుకుని కూడా విశ్రాంతి కల్పించారని కొన్ని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజాతో పాటు కుల్దీప్‌కు అవకాశం ఇచ్చారు.

భారత్ జట్టు 
కోహ్లీ (కెప్టెన్), రాహుల్, విజయ్, ధవన్, రోహిత్, పుజార, రహానే, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఉమేశ్, భువనేశ్వర్, ఇషాంత్.