టెస్ట్‌ సిరిస్‌ భారత్‌ కైవసం

టెస్ట్‌ సిరిస్‌ భారత్‌ కైవసం

 న్యూఢిల్లీ : శ్రీలంకతో ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ 'డ్రా'గా ముగిసింది. భారత్‌కు విజయం ఖాయమనుకున్న టెస్ట్‌ 'డ్రా'గా ముగిసింది. ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో చివరిరోజు భారత బౌలర్లు విజృంభిస్తారనుకుంటే... శ్రీలంక బ్యాట్స్‌మన్లు భారత విజయాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు శ్రీలంక బ్యాట్స్‌మన్లు భారత్‌కు విజయం దక్కకుండా క్రీజ్‌లో నిలదొక్కుకొని 'డ్రా'గా ముగించారు. ఆ ఇద్దరు క్రీడాకారులే ధనుంజయ డిసిల్వా, రోషన్‌ డిసిల్వ... ఒకరు సెంచరీతో కదంతొక్కితే... మరొకరు అర్ధసెంచరీతో చివరికంటా పోరాడి నిలబడ్డారు. దీంతో భారత జట్టు మూడో టెస్ట్‌ మ్యాచ్‌ను 'డ్రా'గా ముగించింది.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి 31 పరుగులతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు ఐదోరోజు ఆట ముగిసే సమయానికి 103 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. లంక జట్టు ఉదయం సెషన్‌లో ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 4 పరుగులు జోడించి మాథ్యూస్‌ రూపంలో నాల్గో వికెట్‌ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్‌ ఇచ్చి మాథ్యూస్‌ (1) అవుటయ్యాడు. మాథ్యూస్‌ అవుటయిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన లంక కెప్టెన్‌ చండీమాల్‌ 36 (90 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో) ధనుంజయ డిసిల్వాతో కలిసి ఐదో వికెట్‌కు అర్ధసెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నిర్మించారు. చివరకు చండీమాల్‌ను అశ్విన్‌ 54.6వ బంతికి బౌల్డ్‌ చేసి ఐదో వికెట్‌ సాధించాడు.

చండీమాల్‌ నిష్క్రమణ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రోషన్‌ డిసిల్వ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లంచ్‌ అనంతరం ధనుంజయ డిసిల్వ, రోషన్‌ డిసిల్వలు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటు టీ విరామ సమయం వరకు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను దాదాపు 'డ్రా' వరకు తీసుకెళ్ళారు. తొలుత ఆచితూచి ఆడిన ధనుంజయ డిసిల్వ, రోషన్‌ డిసిల్వలు సెంచరీ, అర్ధసెంచరీలతో కదంతొక్కారు. టీ విరామానికి ముందు ధనుంజయ డిసిల్వ (119) వ్యక్తిగత పరుగుల వద్ద తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుతిరిగాడు. ధనుంజయ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన డిక్‌వెల్‌ బ్యాటింగ్‌కు వచ్చి చివరి సెషన్‌లో వికెట్‌ పడకుండా రోషన్‌ డిసిల్వతో కలిసి జాగ్రత్తగా ఆడారు. చివరివరకూ క్రీజ్‌లో ఉన్న రోషన్‌ డిసిల్వా సైతం 154 బంతులనెదుర్కొని 11 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. టీ విరామ సమయానికి శ్రీలంక జట్టు ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.

అప్పటికే మైదానంలో నిలదొక్కుకొని క్రీజ్‌లో రోషన్‌ (38) పరుగులతో, డిక్‌వెలా (11) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టీ విరామ అనంతరం 25 ఓవర్ల మ్యాచ్‌ జరిగినా భారత బౌలర్లు చివరి సెషన్‌లో వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. చివరి రోజు వికెట్లు తీయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత కెప్టెన్‌ కోహ్లీ బౌలర్లను మార్చినా వికెట్లు సాధించలేకపోయారు. రెండు కొత్త బంతులను తీసుకొని పేస్‌బౌలర్లు షమి, ఇషాంత్‌ శర్మలకు అప్పగించినా వికెట్లు లభించలేదు. దీంతో కోహ్లీ, మురళీ విజరులు సైతం తలా ఒక ఓవర్‌ వేశారు. ఐదోరోజు ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక జట్టు 103 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. చివరి సెషన్‌లో మరో 7 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరుజట్ల కెప్టెన్లు 'డ్రా'కు అంగీకరించారు. దీంతో మూడో టెస్ట్‌ 'డ్రా'గా ముగిసింది