తొలి టీ20లో భారత్‌ గెలుపు

తొలి టీ20లో భారత్‌ గెలుపు

 కోల్‌కతా : వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్‌ విధించిన 110 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధనలో భారత్‌ 16 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి థామస్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ(6) వికెట్‌కీపర్‌ రామ్‌దిన్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ఇదే థామస్‌ బౌలింగ్‌ మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(3) బౌల్డ్‌ అయ్యాడు. బ్రాత్‌వైట్‌ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతిని షాట్‌ ఆడిన రిషబ్‌ పంత్‌(1) డారెన్‌ బ్రావోకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌(16) ఎనిమిదో ఓవర్‌లో బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌండరీ లైన్‌ వద్ద బ్రావోకే చిక్కాడు. దీంతో పది ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను దినేశ్‌ కార్తీక్‌- మనీశ్‌ పాండే ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడి రాణించడంతో 12ఓవర్లు ముగిసేసరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 69పరుగులు చేసింది. అయితే 15వ ఓవర్‌లో మనీష్‌ పాండే (19) పెరియర్‌ బౌలింగ్‌లో అతనికి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ తరువాత కృనాల్‌ పాండ్యా (21) కలిసి దినేష్‌ కార్తీక్‌ (31) జట్టుకు విజయాన్ని అందిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందుగా భారత బౌలర్లు చెలరేగిపోయారు.

విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కాసేపు అయినా.. క్రీజులో నిలదొక్కుకోనే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా ఆరంభం నుంచి వికెట్లు పడగొడుతూ.. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో విండీస్‌ 8వికెట్ల నష్టానికి 109పరుగులు చేసింది. చివర్లో ఆలెన్‌(27), పాల్‌(15) మెరిపిచండంతో విండీస్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో కులదీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా, స్వదేశంలో ధోని లేకుండా టీ20 మ్యాచ్‌ ఆడడం భారత్‌కు ఇదే మొదటిసారి. స్వదేశంలో భారత్‌కు ఇది 32వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. ఇంతకు ముందు జరిగిన 31 మ్యాచ్‌ల్లో ధోని ఉన్నాడు. అలాగే ఈ సిరీస్‌లో రెండో టీ20 ఈ నెల 6న జరగుతుంది.