తొలి వన్డేలో ఆసీస్‌ చిత్తుచిత్తు

తొలి వన్డేలో ఆసీస్‌ చిత్తుచిత్తు

  పెర్త్‌ : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆదివారం ప్రారంభమైన వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. ఆసీస్‌ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 29.2 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు డికాక్‌ 47, హెండ్రిక్స్‌ 44 పరుగులు చేయగా, మార్‌క్రామ్‌ 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా సఫారీల బౌలింగ్‌కు విలవిలాడింది. దీంతో 38.1 ఓవర్లలోనే 152 పరుగులకు ఆలౌటయింది. ఆదివారం మ్యాచ్‌తో సఫారీ పేసర్‌ డేల్‌ స్టేయిన్‌ తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. 

తన రెండో ఓవర్‌లోనే రెండు కీలక వికెట్ల పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. తొలుత ట్రావిస్‌ హెడ్‌ను ఔట్‌ చేసిన స్టేయిన్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన డీఆర్సీ షార్ట్‌ను డుప్లెసిస్‌ అద్భుత ఫీల్డింగ్‌తో డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. స్టెయిన్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ను డీఆర్సీ షాట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఆ బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న డుప్లెసిస్‌ అంతే వేగంతో సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకున్నాడు. ఈ అద్భుత ఫీట్‌కు మైదానంలోని ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆటగాళ్లైతే సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో సఫారీ బౌలర్లు పెహ్లుక్వాయో మూడు, ఎంగిడి, స్టెయిన్‌, తాహిర్‌లు రెండేసి వికెట్లు సాధించారు. డేల్‌ స్టెయిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఈ నెల 9న ఆడిలైడ్‌లో జరగనుంది.