తొలి వన్డేలో భారత్‌ విజయం

తొలి వన్డేలో భారత్‌ విజయం

 నాగ్‌పూర్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ మహిళలు వికెట్‌ తేడాతో విజయం సాధించి శుభారంభం చేశారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత క్రీడాకారిణుల్లో స్మృతీ మంధాన 86 (109 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించి విజయంలో ప్రధాన భూమిక పోషించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ మంధాన సమయోచితంగా బ్యాటింగ్‌ చేసింది. ఆమెకు జతగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(21), దీప్తి శర్మ(24)లు కూడా రాణించారు. 

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ జట్టులో డానియల్లీ వ్యాట్‌(27), బీమౌంట్‌(37), నటాలీ స్కీవర్‌(21), డానియెల్లీ హజెల్‌(33)లు ఫ్రాన్‌ విల్సన్‌(45) ఆకట్టుకుంది. తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఇంగ్లండ్‌ పదిహేను పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఆపై ఫ్రాన్‌ విల్సన్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి ఇంగ్లండ్‌ను ఆదుకుంది. చివర్లో తొమ్మిదో వరుస బ్యాట్స్‌వుమన్‌ హజెల్‌ కుదురుగా బ్యాటింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ రెండొందల పరుగుల మార్కును దాటింది.