ట్విట్టర్‌లో మోడి ఫాలోవర్స్ ని అధిగమించిన విరాట్

ట్విట్టర్‌లో మోడి ఫాలోవర్స్ ని అధిగమించిన విరాట్

 న్యూఢిల్లీ : ట్విట్టర్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. 2017 ఏడాదికి సంబంధించి ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్రమోడిని అనుసరించే వారిలో పెరుగుదలను కోహ్లీ అధిగమించారని ఒక వెబ్‌సైట్ పేర్కొంది. ప్రధానిని అనుసరిస్తున్నవారి సంఖ్య 2016లో 2.46 కోట్లు ఉండగా.. 2017 డిసెంబర్ 4 నాటికి 52 శాతం పెరిగి 3.75 కోట్లకు చేరుకున్నది. అదేవిధంగా కోహ్లీని అనుసరిస్తున్నవారి సంఖ్య గతేడాది చివరినాటికి 1.29 కోట్లు కాగా, 61 శాతం పెరిగి ప్రస్తుతం 2.08 కోట్లకు చేరుకున్నది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అనుసరిస్తున్నవారిలో పెరుగుదల 56 శాతం ఉన్నది. సచిన్, కోహ్లీలు భారతీయ ఖాతాల్లో టాప్ 10లో చేరడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో బాలీవుడ్ నటులు వెనుకబడిపోయారు. 2017 ఏడాదికి సంబంధించి.. ఇండియా-పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్ ట్రోఫీ-2017 ఫైనల్ మ్యాచ్‌పై అత్యధికంగా 10.8 లక్షల ట్వీట్లు పోస్ట్ కాగా, తర్వాతి స్థానాల్లో జీఎస్టీ, ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్కువ ట్వీట్లు నమోదయ్యాయి.