విచిత్రంగా ఔటయ్యాడు..

విచిత్రంగా ఔటయ్యాడు..

  ఎడ్జ్‌బాస్టన్‌: క్రికెట్‌లో ఒక్కోసారి బ్యాట్స్‌మన్‌  ఔటైన తీరును చూసి ఆశ్చర్యపోతాం. అంతేకాదు, ఒక్కోసారి ఆ ఔట్‌ను చూసి నవ్వుకుంటాం కూడా. ఇలా విచిత్రంగా ఒక బ్యాట్స్‌మన్‌ ఔటైన సందర్భం ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా వార్విక్‌షైర్‌-దుర్హాంల మధ్య మ్యాచ్‌ జరిగింది.  ఇక్కడ భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ దుర్హాం జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

దీనిలో భాగంగా వార్విక్‌షైర్‌ ఆటగాడు రియాన్‌ సైడ్‌బోటమ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన తీరు నవ్వులు పూయిస్తోంది.  వార్విక్‌షైర్‌ జట్టు స్కోరు 199 పరుగుల వద్ద అక్షర్‌ పటేల్ బౌలింగ్‌లో రియాన్‌(1) ఔటయ్యాడు. 66వ ఓవర్లో అక్షర్‌ పటేల్ వేసిన నాలుగో బంతిని రియాన్‌ ఎదుర్కొన్నాడు. ఆ బంతి కాస్తా షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌ హెల్మెట్‌కు తగిలి పైకి లేవడమే కాకుండా బౌలర్‌ వైపుకు వెళ్లింది.  ఆ బంతిని అక్షర్‌ పటేల్‌ చక్కటి సమయస్ఫూర్తితో ఒడిసిపట్టాడు. దీంతో బ్యాట్స్‌మెన్‌ రియాన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ ఏడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.