విరాట్ బ్యాట్‌తో సాధన కోసం..

విరాట్ బ్యాట్‌తో సాధన కోసం..

 లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్ గుర్తుందా? టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఈ అమ్మడు.. విరాట్, నన్ను పెండ్లి చేసుకుంటావా? అని మూడేండ్ల క్రితం సోషల్‌మీడియాలో ట్వీట్ చేసి బాగా పాపులర్ అయింది. ఇదిగో.. మళ్లీ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో కోహ్లీకి సంబంధించి ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. 


2014లో తనకు విరాట్ కానుకగా ఇచ్చిన క్రికెట్ బ్యాట్‌కు సంబంధించిన ఫొటోను మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన డానియెల్లి.. ఈ బ్యాట్‌తో ప్రాక్టీస్ చేసేందుకు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని కామెంట్ రాసుకొచ్చింది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలైన డానియెల్లి.. ప్రస్తుతం యాషెష్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నది. మళ్లీ శిక్షణకు వస్తున్నాను. ఈ బ్యాట్ ఉపయోగించేందుకు వేచి చూడడం నా వల్ల కావడం లేదు అని పోస్ట్ చేసింది.