>

యూసఫ్ పఠాన్‌పై ఐదు నెలల నిషేధం

యూసఫ్ పఠాన్‌పై ఐదు నెలల నిషేధం

 ముంబై: టీమిండియా రన్ మిషన్ యూసఫ్ పఠాన్‌కు బిసిసిఐ షాక్ ఇచ్చింది. డోప్ టెస్ట్‌లో విఫలం కావడంతో అతడిపై ఐదు నెలల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. టర్‌బ్యూటలైన్ (దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్ తీసుకున్నాడు. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. 

కానీ, పఠాన్, జట్టు వైద్యుడు ఈ విషయాన్ని అధికారులకు తెలపలేదు. ఇక డోపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడే బిసిసిఐ పఠాన్‌పై తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో అతడు రంజీ మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. పఠాన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బిసిసిఐ తక్కువ శిక్షతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గత ఆగస్టు 15వ తేదీ నుంచి అతనిపై నిషేధం అమలులోకి రాగా.. ఆ లెక్కన జనవరి 14తో ఆ సస్పెన్షన్ ముగియనుండడం పఠాన్‌కు ఊరటనిచ్చే విషయం. ఇంతకు ముందు 2012 ఐపిఎల్‌లో ప్రదీప్ సంగ్వాన్ కూడా ఇలాగే డోపింగ్‌కు పాల్పడి 18 నెలల నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే.