యువీ ఇక చాలు...!

యువీ ఇక చాలు...!

 ముంబయి: టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్ పనైపోయిందా? ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందా? ఇది క్రికెట్ వర్గాలతో పాటు అభిమానుల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ! తన కెరీర్‌లో అనూహ్య ప్రదర్శనతో ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించి అభిమానుల ఆదరణను సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరు చూసి ప్రతిఒక్క అభిమాని నిరుత్సాహానికి లోనవుతున్నారు. అలవోకగా బౌండరీలు బాదే యువీ ప్రస్తుతం సింగిల్ తీసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. తన బ్యాటింగ్‌లో జోరు తగ్గిందనడానికి గత కొన్ని మ్యాచ్‌ల్లో అతని గణాంకాలే చెబుతున్నాయి. 


శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 14 బంతుల్లో 14 పరుగులు చేసి నిరాశ పరిచాడు. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 12.80 సగటుతో కేవలం 64 పరుగులు మాత్రమే చేసి ప్రస్తుత సీజన్-2018లో అత్యల్ప స్ట్రెక్‌రేట్(91.42) కలిగిన బ్యాట్స్‌మన్(50 అంతకన్నా ఎక్కువ బంతులు ఆడిన ఆటగాళ్లలో)గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అభిమానులు సోషల్‌మీడియాలో తమదైన శైలిలో జోకులు, కార్టూన్‌లతో సెటైర్లు పేలుస్తున్నారు. భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్ తరహాలో క్రికెట్ కామెంటరీ చెప్పుకునే సమయం వచ్చిందని, రిటైర్మెంట్ ప్రకటించి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని సోషల్‌మీడియాలో యువీకి సలహాలిస్తున్నారు.