అందుకు ఒప్పుకోలేదని హిజ్రాపై కాల్పులు!

అందుకు ఒప్పుకోలేదని హిజ్రాపై కాల్పులు!

 న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ట్రాన్స్‌జెండర్‌ శృంగారానికి అంగీకరించలేదని దుండగులు నడ్డిరోడ్డుపై తుపాకీతో కాల్చేశారు. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్రచర్చనీయాంశమైంది. లిఫ్ట్‌ అడిగిన ఓ ట్రాన్స్‌జెండర్‌ను అమ్మాయి అనుకొని పొరపడిన దుండగులు కారెక్కించుకున్నారని, కొంత దూరం వెళ్లాక ఆమెపై లైంగిక దాడికి యత్నించారని పోలీసులు తెలిపారు. ఆమె ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసినా కూడా బలవంతం చేశారని, దీనికి ఆమె అంగీకరించడంతో ఆగ్రహానికి గురై తుపాకీతో కాల్చేసారని సౌతీస్ట్‌ డీసీపీ బిస్వాల్‌ పేర్కొన్నారు. అనంతరం కదులుతున్న కారులోంచి నెట్టేశారని చెప్పారు.

‘ఆదివారం తెల్లవారుజామున 12.38 గంటలకు త్రిలోక్‌పురి-బారాపుల్లా రోడ్డుపై ఓ మహిళా తుపాకీ గాయాలతో విలవిలాడుతుందని మాకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న మా పోలీసులు ఆ మహిళలను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరంచి వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసాం. దుండగుల కోసం గాలింపు చేపట్టాం. సీసీటీవీ ఆధారంగా కారును గుర్తించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతనితో పాటు కారు, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నాం. మా విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మరో నిందితుడిని త్వరలోనే అదుపులో తీసుకుంటాం’ అని బిస్వాల్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్రాన్స్‌జెండర్‌ కోలుకుంటుందని పోలీసులు పేర్కొన్నారు.