బహిష్టుగదిలో ఊపిరాడక తల్లీపిల్లల మృతి

బహిష్టుగదిలో ఊపిరాడక తల్లీపిల్లల మృతి

 బహిష్టుగది ఆచారం తల్లీపిల్లల ప్రాణాలు తీసింది. మహిళలకు నెలసరి వచ్చినప్పుడు వారిని బహిష్టుగదిలో ఉంచడం అక్కడి ఆచారం. ఆ గదికి కిటీలు ఉండవు. చీకటి కొట్టారంలా ఉంటుంది. చలికాలం అయితే వేడికోసం గదిలో మంట వేసుకోవడం ఆనవాయితీ. ఆ చలిమంటే కొంపలు ముంచింది. బహిష్టుగదిలో నిద్రించిన ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు పొగవల్ల ఊపిరాడక మరణించారు. పశ్చిమ నేపాల్‌లోని బజూరా జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అంబా బొహరా (35) అనే మహిళ, ఆమె ఇద్దరు కుమారులు (వయసు 9, 12) తెల్లవారేసరికి విగతజీవులై కనిపించారు. ఈ విషాదఘటన నేపాల్‌లో చర్చాంశమైంది.

ఈ ఆచారానికి ఇకనైనా స్వస్తి చెప్పాలని హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి చౌపడి అని పిలిచే ఈ కాలంచెల్లిన ఆచారాన్ని 2005లోనే నిషేధించారు. కానీ మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా వెనుకబడిన పశ్చిమనేపాల్‌లో ఇది ఇంకా కొనసాగుతున్నది. స్థానిక హిందూ సాంప్రదాయాల ప్రకారం బహిష్టు అయిన మహిళను దూరంగా ఉంచుతారు. ఆ సమయంలో వారిని ఎలాంటి పవిత్ర కార్యాల్లో పాల్గొననివ్వరు. మనేదశంలోనూ బహిష్టు గదులు ఒకప్పుడు సంప్రదాయవాదుల ఇళ్లల్లో ఉండేవి. కానీ కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి.