బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత సజీవదహనం

బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత సజీవదహనం

 రాంచీ : బాలికలను అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించేలా పోక్సో చట్టాన్ని సవరణ చేసిన కూడా మగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. అమ్మాయిలపై మగాళ్లు రాక్షసత్వాన్ని ప్రదర్శించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అంతటితో ఆగకుండా.. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో 16 ఏళ్ల బాలికపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సజీవదహనం చేశారు. ఈ ఘటన మే 3వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 


గురువారం రాత్రి 16 ఏళ్ల బాలికను మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అమ్మాయిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి.. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన నిందితుడికి రూ. 50 వేలు జరిమానా విధించి.. 100 గుంజిలు తీయించారు. ఈ క్రమంలో బాధిత బాలిక కుటుంబంపై పగ పెంచుకున్న నిందితుడు.. తన స్నేహితులతో కలిసి శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులను చితకబాది.. బాధిత బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 14 మందిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.