బాలికపై మామ అఘాయిత్యం

 బాలికపై మామ అఘాయిత్యం

  మెదక్‌ : ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠిన చట్టాలను ప్రవేశపెట్టినప్పటికీ మృగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. కామవాంచ తీర్చుకునేందుకు వావీ వరుసలను మరిచిపోతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కామాందులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. బందువులే కదా అని సరదాగా టీవీ చూసేందుకు వచ్చిన ఓ మైనర్‌ బాలికను మాయమాటలు చెప్పి ఓ వివాహితుడు గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్‌ మండలం పాతూర్‌ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పాతూర్‌ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను వరుసకు మామ అయిన అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల వయస్సు ఉన్న కరుణాకర్‌ నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బంధువులు కదా అని టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికను మాయమాటలతో లోబర్చుకున్నట్లు తెలిపారు. నాలుగు నెలలుగా ఆ బాలికపై అత్యాచారం చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఆ బాలిక కుటుంబీకులు ఇటీవలే స్వగ్రామానికి తిరిగివచ్చినట్లు వివరించారు. చివరకు బాలిక కుటుంబీకులకు విషయం తెలియడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మెదక్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. కరుణాకర్‌కు భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు.