భార్యాభర్తలపై కత్తులతో దాడి

భార్యాభర్తలపై కత్తులతో దాడి

 హైదరాబాద్ : గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై కత్తులతో దాడిచేసి గాయపర్చారు. తీవ్ర గాయాలతో వారు ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. బర్మా దేశానికి చెందిన మౌలానా జాహెద్ హుస్సేన్(32), ఖతీజా బేగం(28) దంపతులు బాలాపూర్ మండలం రాయల్ కాలనీలో నివాసముంటున్నారు.

మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో ఆ దంపతులపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుల కేకలు విన్న చుట్టుపక్కలవారు రాగానే దండగులు పారిపోయారు. గాయపడిని దంపతులను ఉస్మానియా దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉస్మానియాకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.