చైతన్యపురి అపార్ట్‌మెంట్‌లో  చెడ్డీగ్యాంగ్ హల్‌చల్....

చైతన్యపురి అపార్ట్‌మెంట్‌లో  చెడ్డీగ్యాంగ్ హల్‌చల్....

 హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి మోహన్ నగర్‌లో ఉన్న మెట్రో మనోర్ అపార్ట్‌మెంట్స్‌లో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఇవాళ తెల్లవారుజామున ఐదుగురు దోపిడీ దొంగలు అపార్ట్‌మెంట్‌లో దూరి.. ఫ్లాట్ నెంబర్ 203 తలుపు తాళాలు విరగ్గొట్టి ఇంట్లో బీరువా తెరిచారు. అయితే.. ఆ ఇంట్లో వాళ్లకు విలువైన వస్తువులేవీ దొరకలేదు. అపార్ట్‌మెంట్‌లోకి నలుగురు దొంగలు ప్రవేశించగా.. మరో దొంగ వాచ్‌మెన్ రూమ్ దగ్గర ఉన్నాడు.బయట అలికిడి విన్న వాచ్‌మెన్ దొంగలు పడ్డారని గమనించి.. వెంటనే అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ మహిళకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆ మహిళ డోర్ తెరిచి.. బిగ్గరగా దొంగలు.. దొంగలు అంటూ అరిచింది. దీంతో పక్కింటి వాళ్లు అందరూ నిద్రలేవడంతో... దొంగలు అపార్ట్‌మెంట్ నుంచి కిందికి దిగారు. దొంగలను పట్టుకోవడానికి వాచ్‌మెన్ ప్రయత్నించడంతో వాళ్లు వాచ్‌మెన్‌ను బండరాయితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితులు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.