చిన్నారి ప్రాణం తీసిన టీవీ సీరియల్‌

చిన్నారి ప్రాణం తీసిన టీవీ సీరియల్‌

  కోల్‌కతా : టీవీ సీరియల్‌లో వచ్చిన ఆత్మహత్య సీన్‌ను అనుకరించి ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కోల్‌కతా, ఇచ్చాపుర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆ చిన్నారి రెండు నెలల తమ్ముడు మినహా ఇంట్లో ఎవరూ లేరు. బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడానికి ఆ చిన్నారి తల్లి బయటకు వెళ్లగా.. తండ్రి రోజువారి పని మీద వెళ్లాడు. అయితే ఆ తల్లి తన పిల్లలను ఓ కంట కనిపెట్టమని, పక్కింటి వారికి సైతం చెప్పింది. కానీ ఆమె తిరొగొచ్చేసరికి స్కార్ఫ్‌తో ఉరేసుకున్న తన బిడ్డ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. ఆ చిన్నారి రోజు సీరియల్స్‌లో వచ్చే సీన్స్‌ను అనుకరించేదని, వాటిని చూసి తామంతా మురిసిపోయేవాళ్లమని, కానీ ఇంతటీ ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ ఆ బాలిక బంధువులు కన్నీటీ పర్యంతమయ్యారు. 

టీవీ సీరియల్‌లో చూసిన సీన్‌ను అనుకరించబోయి ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోందని, పోస్ట్‌మార్టన్‌ రిపోర్ట్‌ కోసం వేచి చూస్తున్నామని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది తొలిసారేం కాదు. గతేడాది సైతం ఓ ఏడేళ్ల చిన్నారి సీరియల్‌లో వచ్చిన సీన్‌ను చూసి అగ్నికి ఆహుతైంది. మీరట్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలిక ఓ క్రైమ్‌ సిరీయల్‌ను చూసి బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పిల్లలు చూసే సీరియల్స్‌, టీవీ షోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి.