ఫీజు చెల్లించలేదని పిల్లోడ్ని బంధించారు

ఫీజు చెల్లించలేదని పిల్లోడ్ని బంధించారు

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో స్థానిక అశోక్‌ పబ్లిక్‌ అండ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో ఫీజు చెల్లించలేదని ఓ నాలుగేళ్ల చిన్నారిని పాఠశాలలోనే బంధించారు. చిన్న పిల్లాడన్న కనీస జ్ఞానం లేకుండా కొన్ని గంటల పాటు గదిలో నిర్బంధించారు. గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభయ్‌ సోలంకి అనే నాలుగేళ్ల చిన్నారి స్థానిక అశోక్‌ పబ్లిక్‌ అండ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు.

గడువు తేదీ ముగిసినా చిన్నారి స్కూల్‌ ఫీజు కట్టలేదు. దీంతో అభయ్‌ను పాఠశాలలో బంధించారు. స్కూల్‌ ముగిసి పిల్లలందరూ ఇంటికి వెళ్లిపోయినా..అభయ్‌ను మాత్రం ఇంటికి పంపించకుండా తరగతి గదిలోనే ఉంచేశారు. అభయ్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీయగా చిన్నారిని తామే పంపించలేదని స్కూల్‌ సిబ్బంది చెప్పారు. స్కూల్‌ ఫీజు చెల్లిస్తేనే అభయ్‌ను పంపిస్తామన్నారు. దీంతో డబ్బు అందగానే ఫీజు చెల్లిస్తానని అభయ్‌ తండ్రి చెప్పినా వారు వినిపించుకోలేదు. ఎలాగొలా స్కూల్‌ నుంచి చిన్నారిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే తాము అభయ్‌ను బంధించలేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ఆ చిన్నారి ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోవడంతో తామే అతడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రమ్మని చెప్పామన్నారు. అప్పుడు ఫీజు గురించి గర్తుచేశామని చెప్పారు.  ఘటన జరిగిన నాటి నుంచి స్కూల్‌ యజమాని, ప్రిన్సిపల్‌ పరారీలో ఉన్నారు. ఘటనపై విచారణ చేపట్టామని.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని  తెలిపారు పోలీసులు.