కడుపు నొప్పి నయం చేస్తానని  అత్యాచారం

కడుపు నొప్పి నయం చేస్తానని  అత్యాచారం

 మథుర: ఓ వివాహిత కడుపు నొప్పి నయం చేస్తానని మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన మాంత్రికుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో గల వృందవాన్ ఆశ్రమంలో చోటుచేసుకుంది. జిల్లా అడిషనల్ కౌన్సెల్ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది జులైలో హాథ్‌రాస్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది.

ఎంతకు నయంకాకపోవడంతో పరిష్కారం కోసం బాబా ద్వారకాదాస్ దగ్గరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తన భర్త, నాలుగేళ్ల కూతురుతో కలిసి బాబా ఆశ్రమానికి వెళ్లింది. చెడు శక్తులను వదిలించే చికిత్స రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుందని దీంతో రెండో అంతస్తులోని ఒక రూమ్‌లో వెళ్లి ఉండాలని ఆమెకు సూచించాడు. అదే సమయంలో వెలిగించిన మట్టి దీపంతో కింది అంతస్తులో ఉండాలని ఆ దీపం ఆరిపోయిన తరువాతనే తిరిగి రావాలని సదరు మహిళ భర్తకు సూచించాడు. ఒంటరిగా ఉన్న మహిళపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఆమె ఎంత ప్రతిఘటించినా చికిత్సలో ఇదో భాగమని ఆమెకు చెప్పాడు. ఆమె భర్త నిద్రపోయిన తరువాత మరోసారి అత్యాచారం చేశాడు. ఆశ్రమం నుంచి బయటికి వచ్చిన తరువాత జరిగిందంతా తన భర్తకు వివరించింది. సంబంధిత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీనిపై జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జీ వివేకానంద్ శరణ్ త్రిపాఠి తీర్పు వెలువరించారు. నిందితుడికి 25ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేయడంతో పాటు రూ.25వేల జరిమానా విధించారు. ఒక వేళ ఆ మొత్తాన్ని చెల్లించని నేపథ్యంలో మరో 27నెలల పాటు శిక్షను విధించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.