లంగర్‌హౌస్‌లో జంట హత్యల కలకలం

లంగర్‌హౌస్‌లో జంట హత్యల కలకలం

 లంగర్‌హౌస్‌: సిటీ పశ్చిమ మండల పరిధిలోని లంగర్‌హౌస్‌లో జంట హత్యల కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం మూసీ నదిలో ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడ్డాయి. సమీపంలోని కల్లు కాంపౌండ్‌ నుంచి తీసుకొచ్చి చంపారా? లేక ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం  పౌర్ణమి కావడం, గతేడాది తొలి పౌర్ణమి నాడు ఉప్పల్‌లో చిన్నారి నరబలి ఉదంతం చోటుచేసుకోవడంతో... ఇదీ ఆ తరహా ఉదంతమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మృతదేహాలను పరిశీలించిన పోలీసులు అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. మొఘల్‌ నాలా రింగ్‌ రోడ్డు నుంచి రాజేంద్రనగర్‌ వెళ్లే దారిలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్లు ఉన్నాయి. మూసీనదిపై ఉన్న అత్తాపూర్‌ బ్రిడ్జ్‌ కింద స్థానికులు ఆకుకూరలు పండిస్తారు. రోజు మాదిరి మంగళవారం ఉదయం అక్కడికి వచ్చిన వీరు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పనులు పూర్తి చేసుకున్నారు.

మూసీలో కాళ్లుచేతులు కడుక్కోవడానికి వెళ్లగా, పిల్లర్‌ నెం.118 కింది భాగంలో ఒడ్డుకు సమీపంలో గడ్డి మొక్కల మధ్యలో ఓ మనిషి కాలు ఉండడాన్ని గమనించారు. దీంతో మృతదేహంగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన లంగర్‌హౌస్‌ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి 30–35 ఏళ్ల మధ్య వయస్కురాలైన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా... మరో కలకలం రేగింది. ఈ మృతదేహాన్ని తీసిన చోటే కదలిక ఉండడంతో ఇంకాస్త లోపలకు దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెండో దాన్ని బయటకు తీశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలు ఉన్నట్లు తేల్చారు. మృతదేహాలు కుళ్లిపోకపోవడంతో హత్యలు సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.