మూడో పెళ్లి కోసం ఇద్దరు భార్యలకు చిత్రహింసలు

మూడో పెళ్లి కోసం ఇద్దరు భార్యలకు చిత్రహింసలు

 హైదరాబాద్‌: నగరంలోని బోరబండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి  మూడో  వివాహం కోసం ఇద్దరు భార్యలను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు బాధితురాళ్లు సోమ‌వారం పోలీసులను ఆశ్రయించారు. రెండవ భార్య నిస్సార్‌ బేగం15రోజుల బాలింత అని కూడా చూడకుండా మూడో పెళ్లికోసం అనుమతి పత్రంపై సంతకాలు చేయాలని చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అతని వేధింపులు భరించలేని ఇద్దరు భార్యలు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు నేడు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం...బోరబండ ప్రాంతంలో నివాసముంటున్న మహమ్మద్‌ ఖాన్‌ గతంలో  రుక్సార్‌ బేగం, నిస్సార్‌ బేగంలను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య అయిన నిస్సార్‌ బేగం 15రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అయితే తాను మూడో వివాహం చేసుకుంటానని, అనుమతి పత్రంపై సంతకం చేయాలని బాలింత అని కూడా చూడకుండా నిస్సార్‌ బేగంను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇతని దాష్టీకాలను భరించలేని ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.