నచ్చినవాడికి దూరంకాలేక...ఓ వివాహిత పన్నాగాలు

నచ్చినవాడికి దూరంకాలేక...ఓ వివాహిత పన్నాగాలు

 హైదరాబాద్ : భర్తతో కలిసుండడం ఇష్టం లేని ఓ వివాహిత...అతడి నుంచి దూరమయ్యేందుకు వేసుకున్న ప్లాన్ తనకే బెడిసికొట్టింది. భర్త నుంచి దూరమయ్యేందుకు ఎంతగా ప్రయత్నించినా.. అది సాధ్యం కాకపోవడంతో ఇరకాటంలో పడింది. రకరకాల ట్విస్టులతో నిండిన ఈ నిజ జీవిత ఘటన పోలీసులను కూడా ఒకింత విస్మయానికి గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన మాలతి (పేరు మార్చాం) బీటెక్ పూర్తి చేసింది.

ఆమె తల్లిదండ్రులు ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువకుడితో పెండ్లి సంబంధం కుదుర్చుకున్నారు. అయితే అతనికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా తీసుకొని ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని మాలతి అతనితో పెండ్లికి ఒప్పుకోలేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కూతురి భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదన్న భరోసాతో మాలతి ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా అతనితో వివాహం చేశారు. కాపురానికి వెళ్లిన తర్వాత భర్తతో అయిష్టంగానే మెలుగుతూ వచ్చింది.ఈ నేపథ్యంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచమయ్యాడు. అది స్నేహంగా మారి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఆ ప్రియుడికి కూడా భార్య, ఇద్దరు పిల్లలున్నారని తెలుసుకున్నది. అయినా సరే తన భర్తను వదిలి ప్రియుడితో కలిసుండాలని నిర్ణయించుకున్నది. ఇక అప్పట్నుంచి భర్తను దూరం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.


ఇక తన ప్లాన్‌లో భాగంగా మాలతి మారుపేర్లతో జీమెయిల్ ఖాతా, సోషల్ మీడియా ఖాతాలు తయారు చేసుకున్నది. తన ప్రియుడి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ నుంచి భర్తకు సందేశాలు పంపడం మొదలుపెట్టింది. నీ భార్య మంచిది కాదు. నీవు ఎంత బాగా చూసుకున్నా.. నిన్ను వదిలేసి వెళ్లిపోతుంది. నిన్ను మోసం చేస్తుంది. నీ భార్య వేరొకరితో సంబంధం పెట్టుకున్నది. నీవు లేని సమయంలో అతనితో కలుస్తూ ఉంటుంది అంటూ తన భర్త మనసులో తన గురించే చెడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది.

అయితే ఇక్కడ ఆమె భర్త దీనిపై అనుమానించలేదు. తన భార్యను కించపరుస్తూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా మెసేజ్‌లు పంపిస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఈ దర్యాప్తులో పోలీసులను దిగ్భ్రాంతిపర్చే వాస్తవాలు తెలిసొచ్చాయి. తనపై తానే ఇలా నిందలేసుకొని భర్తకు మెసేజ్‌లు పంపించిందని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాలతి ఫేక్ జీమెయిల్ ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల వివరాలు, సందేశాలు, ఇతరత్రా ఆధారాలను సేకరించారు.ఈ విషయాన్ని సున్నితమైన అంశంగా పరిగణించిన పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆమెను సంసారం చేసుకోవాలని సర్ది చెప్పారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. మెసేజ్‌లను పంపించిన ల్యాప్‌టాప్ ప్రియుడిది కావడం, మాలతిని వేర్వేరు రకాలుగా ప్రలోభ పెట్టడం వంటి అంశాలపై ఆధారంగా పోలీసులు అతడి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.