ఔటర్‌లో రోడ్డు ప్రమాదం:విద్యార్థిని మృతి

ఔటర్‌లో రోడ్డు ప్రమాదం:విద్యార్థిని మృతి

 శంషాబాద్ : స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బూర్జుగడ్డతండా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనన్య గోయల్ (24), జతిన్, నిఖిత బన్సాల్ స్నేహితులు. అనన్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నది. జతిన్, నిఖిత నగరంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. సోమవారం రాత్రి జరిగిన జతిన్ పుట్టిన రోజు వేడుకలకు అనన్య, నిఖిత హాజరయ్యారు. 

అర్ధరాత్రి కేక్ కోసిన తర్వాత శంషాబాద్ వద్ద ఉన్న హోటల్‌లో డిన్నర్ చేసేందుకు గచ్చిబౌలి నుంచి కారులో బయలుదేరారు. శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ వద్ద ఓఆర్‌ఆర్ దిగి పీ1 రోడ్డులో అతివేగంగా ప్రయాణించడంతో బూర్జుగడ్డతండా సమీపంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాదంలో అనన్యకు తీవ్రగాయాలు కాగా మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ముగ్గురిని సమీపంలోని దవాఖానకు తరలించాగా అనన్య అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మద్యం సీసాలు దొరికినట్టు తెలిసింది. దీంతో మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు.